“ఏ గురువు దగ్గరా బొమ్మలు నేర్చుకోలేని అట్టడుగు నుండి, దాదాపు 54 దేశాలలో వేలాది మంది విద్యార్థులకు బొమ్మలు గీయడమెట్లాగో నేర్పించిన ఒక గురువు చరిత్ర ఇది. బొమ్మల చరిత్ర అంతటికీ మనకు మిగిలిన ఒకే ఒక ఆల్బర్ట్ డోర్న్ని కలుద్దాం, రండి“
ఏది ముఖ్యం? పనిగట్టుకు నన్నెవరూ ఈ ప్రశ్న అడగరు కాని, నా పనిలో ఆకలి ముఖ్యం అనుకుంటాను. ఎటువంటి ఆకలి అది? ఆవురావురవుతూ వుండాలి నీవు, అమాంతం మీదబడి బొమ్మల్ని కబళించేంతటి ఆకలి కలిగి వుండాలి, ఒక పూటకు ముగిసే ఆకలి కాకూడదు, జన్మంతా శాపగ్రస్తుడిలా మొయ్యాల్సిన ఆకలి రహస్యం ఇది, ఇదిగో ఇటు చూడు, ఈ అలమార నిండా వున్నవి పుస్తకాలు కావు ఆకలి మందులు, దేశ విదేశాలవి, లావువి సన్నంవి, రంగులవీ రేఖలవీ, నానా రకరకాలవి, రకాలు వేరైనా రుచి ఒక్కటే — కరుకు కషాయం, విషం.
ఇదిగో దీని పేరు రాబర్ట్ ఫాసెట్, ఇది బెర్నీ ఫ్యూక్స్, ఇక్కడ రాక్వెల్, అక్కడ బట్టగ్లీయా, ఈ మధ్య బాపు, ఆ మూల బ్రెసియా, దాని పైన గాగిన్, ఆ పక్క వాంగాగ్, వీటన్నిటి మధ్య, మరింత దర్జాగా, మరింత ఘాటుతో సిగార్ పొగలు గ్రక్కుతున్న……. ఈ ఆకలి సిసలు పేరు ఆల్బర్ట్ డోర్న్. కోటికీ, వంద కోట్లకు కూడా ఎవడికీ అందని జీవితం డోర్న్ ది, ఆల్బర్ట్ డోర్న్ ఆ కాలానికే కాదు, ఏ కాలానికైనా వీరుడు, చిరకాలపు చిత్రకారుడు.
ఫిబ్రవరి 07, 1904న న్యూయార్క్ నగర మురికి వాడలో జననం, ఊహ తెలిసి తెలియక ముందే తండ్రి మరణం, తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, చిన్న తమ్ముడు ఒకడు. కుటుంబానికంతా డోర్నే పెద్ద మగ దిక్కు, తండ్రి వారసత్వంగా వదిలి వెళ్ళిన దారిద్ర్యంతో పాటు తను పుట్టుకతో వెంట తెచ్చుకున్నవి క్షయ, గుండె జబ్బు.
అయిదేళ్ళ వయసు నుండి అలవడింది బొమ్మల పిచ్చి, ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు అనేది సిసలు అబద్ధం. అసలు నిజం బడిలో గడపాల్సిన కాలమంతా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో గడిపేవాడు, 15 ఏండ్లు వచ్చి రాక ముందే మ్యూజియం లోని ప్రతి బొమ్మనూ కాపీ చేశాడు, నోటు పుస్తకాల నిండా స్కెచ్చులే స్కెచ్చులు.
చదువు పెద్దగా ఇష్టం లేదు, బొమ్మల చదువు కొనేంత శక్తి లేదు, అంతకన్న ముఖ్యం గా ఇల్లు గడవాలి, తనే నడపాలి. రోజుకు కనీసం ఒక్క పూట తిండి సంపాదించేంత డబ్బు సంపాదించాలి. పదమూడేళ్ళ వయసునుండి గడియారంతో పోటీ పడే పరుగు ప్రారంభమయ్యింది. ఆ వయసులలోనే న్యూయార్క్ వీధుల్లో నాలుగు న్యూస్ స్టాండ్స్ నుంచి పేపర్ల అమ్మకం, ఇటో కాలు, అటో కాలు, 14 వ సంవత్సరం రాగానే సినిమా థియేటర్లో బాయ్ గా ప్రమోషన్, 15 వ సంవత్సరానికి సేల్స్ మాన్ గా కొత్త అవతారం, ఇదంతా చాలదన్నట్టు 16వ ఏటే పెళ్లి కూడా చేసుకున్నాడు, ఒకటికి రెండు సంసారాలు పోషించాలిప్పుడు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, మరింతగా పరిగెత్తాలి, మరింత వేగంగా దరిద్రం నుంచి దూరంగా.
ఇన్ని బాధ్యతల మధ్య తన బొమ్మలు ఏమయ్యాయ్? ఎక్కడ పారేసుకున్నాడు? విధి కొల్లగొట్టాలనుకున్న తన అపురూపమైన జీవితాన్ని విధిని తన్ని మరీ వెనక్కు లాక్కుచ్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
జీవితంతో పందెం కాశాడు, చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి, న్యూయార్క్ లోని ఒక ఆర్టిస్ట్ యాడ్ ఏజెన్సీ లో సున్నా జీతం క్రింద ఉద్యోగానికి కుదురుకున్నాడు, ఆ ఆర్టిస్ట్ దగ్గర పని నేర్చుకోవడమే తనకందే జీతం, అక్కడ ఆఫీస్ బాయ్ నుంచి డెలివరీ బాయ్ వరకు మొత్తం పని తనదే. వారానికి ఆరు రోజుల పని, ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరున్నర వరకు. మరి సంసారం? యాడ్ ఏజెన్సీ తాళం వేయగానే పరిగెత్తుకు ఇంటికి వెళ్ళడం, కాస్త తినడం, కొంచెం నిద్రపోవడం, అప్పట్నుంచి మళ్ళీ ఉదయం ఎనిమిది గంటలవరకు షిప్పింగ్ యార్డ్ లో క్లర్క్ గా రాత్రి ఉద్యోగం, ఇది వారానికి ఏడురోజుల పని, ఇన్నిటి మధ్యలో ఏ మధ్యలో ఖాళీ దొరికినా స్థానిక బాక్సింగ్ పోటీల్లో చేయి కలిపేవాడు, చిల్లర ఆదాయంకోసం. చివరకు బొమ్మలు వేయడానికి చేతులు మిగలవని జ్ఞానించి ఆ బాక్సింగ్ పని వదిలేశాడు.
ఈ సున్నా జీతం జీవితాన్ని సరిగ్గా సంవత్సరం చేశాడు, తరువాత నెలజీతం మీద చిత్రకారుడిగా జీవితం మొదలయ్యింది, రేయింబవళ్ళు బొమ్మలే బొమ్మలు, జీవితం గడిచిపోతుంది, ఇక చిల్లర పనులు వెతుక్కోనక్కరలేదు, మరొక సంవత్సరం గడిచింది, చేస్తున్న ఉద్యోగం వదిలేశాడు, ఇంకొంచెం మంచి జీవితం, మరికాస్త ఎక్కువ డబ్బు కావాలిప్పుడు, తనే స్వంతంగా పని ప్రారంభించాడు.
‘జబ్ తక్ మెహనత్ హై తబ్ తక్ తక్‌దీర్ హై’ అనే మాటని నమ్మిన వాడి విషయం లో ఏం జరగాలో అదే జరిగింది, తను కోరుకున్న దానికన్న అద్భుతమైన జీవితం చేతికందింది.
ఆల్బర్ట్ డోర్న్ అంటే ఇప్పుడు అమెరికా అంతటికీ వాణిజ్య ప్రకటనల చిత్రకారుడిగా పెద్ద పేరు, ఫలానా ఫ్రిజ్ అమ్ముడు పోవాలన్నా, మార్కెట్లో ఏ కొత్త మోటర్ ఆయిల్ దూసుకు పోవాలన్నా, అది ఇదని కాదు ఏ ప్రకటనకైనా డోర్న్ బొమ్మల్నే వాడాలనేంతటి డిమాండ్. ఎందుకంతటి డిమాండ్? వేరే చిత్రకారుల్లో లేనిదేమిటి? డోర్న్ చిత్రించినదేమిటి?
మంచికో చెడుకో డోర్న్ బ్రతికిన పేద బ్రతుకు ఇచ్చిన వరం అది, జీవితాన్ని, చాలా జీవితాల్ని చాలా దగ్గరగా చూడ్డంవల్ల వచ్చిందది, రకరకాల మనుష్యుల, పలురకాల మొహాలు వాటిలో పలికే వ్యక్తీకరణలు, ఆనంద దుఃఖాలు, కుళ్ళు చూపులు, కుతంత్ర వేషాలు, ఒఖ్ఖటని లెక్కేమిటి మానవుడు వేయగల వేషాలన్నింటిని ఒడుపుగా పట్టేశాడు, తన బొమ్మల్లో అవన్నీ జొప్పించాడు, మనుగడ కోసం పోరాటం ప్రారంభించినవాడు, దాన్ని నిలబెట్టుకోవడం కోసం తన పదునైన కన్నుతో మానవ శరీర మూల మూలాల్లోకి వెళ్ళి దాని చుట్టుతా వున్న దాన్ని మెదడు నిండా నిక్షిప్తం చేసుకున్నాడు — మనిషి, వాడి శరీరం, లోపలి ఎముకలు, దానిచుట్టుతా ఆవరించుకున్న గుజ్జు, ఆ పైని వస్త్రాలు వాటి మడతలు, ఎంతటి మోడల్ని పెట్టుకున్నా చూపించలేని విన్యాసాలన్నింటిని తన బుర్ర లోంచి తీసి కాన్వాస్ మీదికి వొలికించేవాడు. అందుకే తన బొమ్మలు జనానికి దగ్గరగా వుండేవి, కల్చర్ని పట్టి చూపించేవి.
సున్నా జీతం సంపాదన దగ్గర మొదలు పెట్టి, ఆపై అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నిటిలోకెల్లా అతి ఎక్కువ పారితోషికం అందుకున్న చిత్రకారుడిదాకా ఎదిగాడు.
ఇక తనకు కావల్సిందేమిటి? తనలాంటి బాల్యాలున్న వేలాది బాల్యాలు, బొమ్మలపై ప్రేమ ఉండీ కూడా నేర్చుకోలేక పోతున్న వారు. ఆ రోజుల్లో అమెరికాకంతటికీ పెద్ద పేరున్న చిత్రకారులు నార్మన్ రాక్వెల్, జాన్ అథర్టన్, ఆస్టిన్ బ్రిగ్గ్స్, స్టీవన్ డొహానోస్, రాబర్ట్ ఫాసెట్, పీటర్ హెలెక్, ఫ్రెడ్ లూడ్కెన్స్, అల్ పార్కర్, బెన్ స్టాల్, హెరాల్డ్ వాన్ ష్మిత్ (మనకు తెలుగు ఇలస్ట్రేషన్ లో తెలిసిన పెద్ద పేరు బాపు, వంద బాపుల అంతటి కన్నా అత్యంత అమితమైన ప్రతిభ కలిగిన 12 మంది చిత్రకారులు కలిసి అమెరికాలో ఒక తరానికంతా బొమ్మల పాఠాలు నేర్పించారు! ఏమదృష్టం!!) లను కలుపుకుని ఫేమస్ ఆర్టిస్ట్ స్కూల్ ని మొదలుపెట్టాడు. తన జీవిత కాలం లోనే 54 దేశాల నుంచి 50 వేలకు పైగా విద్యార్థుల్ని తయారు చేశాడు.
ఒక అద్భుతమైన పోరాటపటిమ కలిగిన ఈ మహా చిత్రకారుడు తన 61వ ఏట డిసెంబర్ 15 న భౌతికంగా మరణించాడు, కాని తన జీవిత కాలంలో తను చిత్రించిన బొమ్మలు ఇంకా వున్నై, తను నెలకొల్పిన ఫేమస్ ఆర్టిస్ట్ స్కూల్ ప్రపంచ వ్యాప్తంగా చిత్రకారుల్ని తయారు చేస్తూనే వుంది. వీటన్నిటిని మించి ఆల్బర్ట్ డోర్న్ ప్రపంచంలో తన జీవితంతో ఏదో ఓ మూల ఎవరో ఒకరిని ప్రభావితం చేస్తూనే వున్నారు, ఆ ప్రభావితానికి అంతం లేదు.

Leave a Reply