మూడు జన్మల కల

తల్లి తండ్రులు, స్వంత ఊరు, ఊళ్ళో నాదంటూ ఇల్లు. ఏదీ లేని కేరాఫ్ నథింగ్ ల సంగతి ఇది. కానీ నథింగ్ లకు కూడా కలలు ఉంటాయి. నథింగ్ ల గురించి కూడా కలలు కనే కళ్ళు ఉండాలి అనే ఒక కలని కనే రెండు కళ్ళు — మూడు ముప్ఫైల మూడు జన్మలు అనే కథగా రాసుకున్న కల ఇది.

ఇది ఎవరి సంగతీ కాదు. ఎక్కడో ఒకక్కడ ఉండే నా వంటి దరిద్రుడు, దౌర్భాగ్యుడి సంగతి తప్ప. ఇది ఆర్థిక పేదరికం సంగతి కూడా కాదు. తన కోసం ఒక కల కనే మనుష్యులు లేని వారి సంగతి. ఊరికే ఊహించుకోబుద్ధిగా ఉంటుంది. పుట్టిన బిడ్డని ఒడిలో వేసుకొని తల్లి వాడి కోసం వాడు కనబోయే కలని ముందుగా తను కని ఉండదా? అటువంటి చిన్న కల అచూకీ కోసం నేను చూస్తూ ఉంటా చూస్తూనే ఉన్నా! నే గీసిన బొమ్మ ని చూడ్డం కన్నా ముందు ప్రతి రోజూ నా బొమ్మలు గీసే చేతి వేళ్ళని దిష్టి తీసే ఒక తల్లి నా పెద్ద కల. ఇది తీరని కల. సంచి తగిలించుకుని మెట్లు దిగి బడికో, ఆఫీస్ కో బయలు దేరిన నా వీపు వెంట తోడుగా వచ్చే అమ్మ చూపులు అంటని ఆ కల గురించి నేనేం మాట్లాడలేను కానీ ఊహ బోలెడుగా చిత్రించుకుంటా. ఆ మాత్రం ఏకాంతం – ఆలోచన – ఊహ – నాకు ఇచ్చాడు దేవుడు. నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు కదా. నేను చిన్నతనంలో చాలా మంది తల్లులని, పిల్లలని చూశాను. భుజాన సంచి తగిలించుకుని వెళ్ళే పిల్లల్ని గుమ్మం వరకు వచ్చి, ముద్దు పెట్టి బడికి వెళ్ళే పిల్లలని మురిపంగా చూసే తల్లులని. ఆ పిల్లాడ్ని బడికి పంపిస్తూ వాడి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కని ఉంటుంది ఆ తల్లి. నాకు చిన్నప్పటి నుండి అమ్మ లేదు. నాన్న చాలా దూరాన ఉన్నాడు. నేను పెరిగి  పెద్ద అవడానికి ఏ కళ్ళు కలలు  కనలేదు. ఆ వాస్తవం  చాలా చిన్నతనం నుండి హింసగా ఉండేది నాకు

తల్లి తండ్రులు, స్వంత ఊరు, ఊళ్ళో నాదంటూ  ఇల్లు. ఏదీ లేని కేరాఫ్ నథింగ్ సంగతి నాది. కానీ నథింగ్ లకు కూడా కలలు ఉంటాయి. డబ్బు లేకున్నా, తన కోసం కలలు కనే తన వారు లేకున్నా ఏదో ఒక రోజు వాడు కనాల్సిన కల ఒకటి అమానవీయంగా పెద్ద రెక్కలు వేసుకు వచ్చి వాడికి మెలకువ తెప్పిస్తుంది. ఇక నిదుర పట్టనివ్వని ఆ అనునిత్యపు కల వెంట వీడు పరిగెడుతున్నాడా? లేదా అది వీడిని తరుముతుందా? ఈ పరుగులో ఆ కల కోసం ఇదిగో ఇక్కడ ఒక ప్యూర్ అబ్సర్డ్ ప్రతిపాదన వ్రాసుకుంటున్నా, అదేమిటంటే..

 నిండు నూరేళ్లు బ్రతుకు  అంటారు.  అన్నేళ్ళు   బ్రతకాలా? అని అనుమానం ఏం అక్కర్లా. చిన్న మార్పుతో చిన్న భాగాల విభజనతో బ్రతకడం ఎంత బావుంటుంది అనే సూత్రం ఒకటి వచ్చి నా మనసుని తాకింది. ఇది వ్రాస్తున్నంత సేపు రావాలా? రమ్మంటావా? కనీసం ఒక్కసారి? అనే దుఃఖాన్ని బలంగా ఆపుకోవాల్సి వచ్చింది కూడా. ఇది మూడు ముప్ఫైల ఒక బ్రతుకుని రాసుకునే కథ. ఇంకో పది ఏం చేస్తావు అని అడగవద్దు. నీకు ఇచ్చాననుకో! తీసుకో, నా మనసు పెద్దది.

డబ్బులేని వాళ్ళు దిక్కు లేని వాళ్ళు ఇవి రెండూ లేకపోగా ఊపిరి లా ప్రాణం పోసే తీసే కూడా నాలా  కల ఉన్నవాళ్ళు ఈ నూరేళ్ళ జీవితంలో 30 ఏళ్లకి మించి ఎక్కువ బ్రతకరాదని. ముప్ఫైకి బ్రతికి ముప్ఫై అవగానే చనిపోయి వరుసగా ఇంకా రెండు ముప్ఫై లకు తిరిగి తిరిగి పుట్టాలి, మూడు ముప్పైల్లో మరణించాలి. ముప్పై ప్లస్ ముప్పై ప్లస్ ముప్పై సూత్రం ఇదని నా జాతి వాళ్లకోశం నేను కంటున్న కల ఇది

నావంటి నాకు నావంటి ఇతగాడికి మొదటి ముప్ఫై అందరిలాగే మామూలుగా ఉంటుంది. ఇరవై వరకు ఏవీ తెలీదు, ఏ కల పుట్టదు. అసలేం ఎరగకుండానే, ఎరిగి ఉన్నదంతా తెలుసుకోలేక మునుపే ఇరవైలోకి వచ్చేస్తాం, గతించిపోయిన 19 కేసి వెనక్కి తిరిగి చూసే బెంగ కూడా ఉండదు. పుట్టుకతో వచ్చిందనుకున్న బొమ్మ మీద బెంగ ఉండదు, బొమ్మాయిల వంటి అమ్మాయిల మీద మాత్రం మోజు ఉంటుంది. బొమ్మ మనదే కదా! ఎప్పుడో పుట్టక మునుపే వచ్చేసినదే కదా అనే అజ్ఞానం మాత్రం నిండుగా ఉంటుంది. ఇది అజ్ఞానం రా? మాయ రా! అని చెప్పేందుకు ఎవరూ రారు. దయగా వారు విచ్చేసినా వినిపించుకోడానికి నాకు అప్పుడు రెండు చెవులు ఉండవు. రెండు గుడ్డి కళ్ళు మాత్రం ఉంటాయి. తను తప్ప మరేం కనపడని కళ్ళు. ఇది పిచ్చి ముప్ఫై! లెక్కలోకి లేని ముప్ఫై! అజ్ఞానపు ముప్ఫై!

ఆవిధంగా మొదటి ముప్ఫైలో బ్రతికిన బ్రతుకు శుద్ధ అప్రయోజనం. అది తెలుసుకుని చివరగానయినా కళ్ళు తెరుచుకుని వగుస్తూ ఒక చచ్చిపోవాలి. ఆ చనిపోయే మొదటి ముప్ఫైలో తెలిసిపోవాలి ఏది ముఖ్యం? దేని వెంట జీవితం అని! కానీ చావం – అలా బ్రతికే ఉంటాం. చస్తే బావుంటుందనే ఒక జ్ఞానం మాత్రం పుడుతుంది. ఆ పుట్టిన తెలివిడి వృధా పోదు, దానివల్ల రెండో ముప్ఫైలో కళ్ళు తెరవగానే పిచ్చిభావనలు అన్నిటికీ తలుపులు మూసేసి నాకు నేను నాన్ననవుతా, నేనే నా అమ్మనవుతా! మొదటి ముప్ఫై తాలూకు జ్ఞానం ఉంటుంది కాబట్టి అమ్మ కావాలి, తన ప్రేమ పొందాలి, తను నా కల తన కళ్ళతో చూడాలి…. అనే తొలిలోని వెర్రి ఆరాటం అదీ వెళ్ళి పోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక బాధ్యత! భరోసా! అది నాన్న మాత్రమే కావాలి. నేను ఏం కావాలని కోరుకున్నా నా నీడలా ఉండి నిజంలా కంటి ముందుకు వచ్చే నాన్న! ఆయన అందించే డబ్బు సాయం, ఆర్థిక దయ కోసం నాకు నేనే నాన్నని అవ్వాలి.

నాకు ఉన్న నాన్నని నేనేనని నాకు తెలిసి ఉన్నప్పుడు గత జన్మలోని మరణ కాలంలో గుప్పిట్లో గట్టిగా పట్టుకుని చచ్చిపోయిన కల ఒకటి ఈ జన్మలో కూడా అలానే పట్టుకున్న గుప్పిట చూడగానే గుర్తుకు వస్తుంది. ఆ కల ఆ గులాబి అరచెయ్యి నిండా పాకి రక్త కణం కణంలో నిండి ఉంటుంది. ఆ పాత జన్మలో పదవతరగతి పరీక్ష వ్రాసిన కుర్రవాడు ఒకడు బోలెడన్ని దినపత్రికలు వెదికి వెదికి నోట్ చేసుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆగ్రా, విశ్వభారతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, హైదరాబాద్ జే ఎన్ టీ యూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్…

కానీ ఈ జన్మలో ఆ చిత్రకళా దారులన్నీ నలిపేసి నమిలేసి ఒక బలమైన చెయ్యి బాలాజీ కాలేజి వైపుగా దారి చూపిస్తూ ఉంటుంది. ఏవీ ఆసక్తి లేని చదువు, అమానత్ ఖాతాలు, చరిత్ర, మాకియవెల్లి, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం…… అలా ప్రయోజనం లేని చదువు ఒకటి ముగుస్తుంది, కొన్ని బంగారు రోజులు చిలుం పట్టి పొడి పొడిగా రాలిపోయి ఉంటాయి. అయినా ఆశ ఉంటుంది. ఒక రోజు పిల్లవాడి చేతిలో జెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ లో చేర రమ్మని ఒక కాగితం ఉంటుంది. పిలుపు ఆశగా ఉంటుంది. భరోసా ఉండదు. కలలు కనే అమ్మ కళ్ళు ఉండవు. ఉన్న నాన్నకు మనసు ఉండదు. కల ఉన్న పిల్లవాడికి ఖాళీ జేబు ఉంటుంది, డబ్బు గల జేబు వెనుక గుండె వుండదు. ఆ కల ఖాళీ అవుతుంది. అడ్మిషన్ లెటర్ గాలికి ఎగిరి పోతుంది. దేశం లో తొలి లేదా మలి యానిమేటర్ గా నిలవవలసిన ఒక పేరు సూపర్ మాక్స్ బ్లేడ్ పెట్టి సమూలంగా చెక్కబడుతుంది. సూపర్ మాక్స్ మా నాన్న షేవింగ్ బ్లేడ్ బ్రాండ్. ఒక పదునయిన కళ్ళ తీక్షణతలో కేవలం నా పద్దెనిమిది వేల రూపాయల కల కాలిపోతుంది. అందులో నా పంతొమ్మిదేళ్ల వయసు, గంటల తరబడి బొమ్మలు గీయగలిగిన నా సహనం, నా గుంత కళ్ళనిండా నింపుకున్న కంటి నలుపు అంతా సిరాలేని చీకటి అయిపోతుంది. తరువాత పద్దెనిమిది వందల పదుల ఒక లక్షా ఎనభై వేల డబ్బుల ఎక్కం నా నోటికి తెలిసినా, నా జేబుకు వచ్చినా, ఏం లాభం లేదు. ఇప్పుడు ఆనాటి చిన్న కొడుకు పెరిగి నాన్నయ్యాడు. ఈ నాన్న కొడుక్కి భరోసా ఉంది. నాన్న జేబుకి కొడుకు కల గుచ్చబడి ఉంది. కల ఉన్న నాన్నకే ఏమీ లేదు. అతడు అలాగే అప్పటి అనాధ కొడుకు లాగే ఉన్నాడు. చీకట్లో నిలబడి ఉన్నాడు. కాపాడ్డానికే ఏ వెలుతురూ రాదు. ఇక్కడ ఇంకో ముప్ఫై అయిపోతుంది. ఒక చావు ముగిసి పోతుంది. ముందు జాగ్రత్త తో చేసి పెట్టిన బోలెడు ఇన్స్యూరెన్స్ డబ్బు భార్యా పిల్లలకు వస్తుంది. ఉన్ కా లైఫ్ బన్‌జాయేగా!

మూడవ ముప్ఫైలో మళ్ళీ పుట్టగానే ఏం గుర్తుకు రావద్దు. ఆ బొమ్మల కల తప్ప. బుర్రలో అక్షరం, నోట్లో నాలుకా వద్దు. మెయిల్ ఐడీ, డెబిట్ కార్డ్ పాస్ వర్డ్, ఫేస్‌బుక్, వాట్సప్, రోడ్ నెంబర్ వన్ బంజారా హిల్స్, ప్రశాసన్ నగర్ కాలనీ, పిల్లర్ నెంబర్ ఎయిటీ సిక్స్, మారుతీ నగర్….. ఏం అసలొద్దు. కేవలం పలికేది పలికించేదీ మొత్తం మునివేళ్ళ రేఖల రంగుల నడకే. భార్యా బిడ్డలు, భవ బంధాలు, స్నేహాలు, కపటాలు, ఏవీ వద్దే వద్దు. కేవలం బొమ్మలు నిద్ర. బొమ్మలు నేర్చుకోవడం నిద్ర కోరడం. మళ్ళీ ఎన్నడూ కలలు రానన్ని, కననవసరం లేనన్ని బొమ్మలు గీయాలి, మెలకువ రానంత నిద్ర పోవాలి. గమ్యం తెలియాలి, బొమ్మల బడిలో చేరి మాస్టర్స్ పాదాల చెంత బొమ్మలు నేర్వాలి. గత అరవై సంవత్సరాల మెలకువ జ్ఞానం ఇక్కడ పని చేస్తుంది. అయిదు సంవత్సరాలకే నేర్వాల్సింది మొత్తం నేర్చేస్తా. ఇప్పుడు కనబడిన జీవితాన్ని మొత్తం రికార్డ్ చెయ్యాలి. లోపలా బయటా క్షణక్షణ చలన జీవితాన్ని అంతటిని పెన్ను ముక్కు చివరతో గేలంలా లాగేసుకోవాలి. ఆకలివేసినపుడు వంద రూపాయలకో మొహం వేస్తా. రెండు గుప్పిళ్ళ అన్నం చాలు. కడుపు ఆకలి చిన్నది. ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు దారిని కొలవాల్సిన బొమ్మలు వేసిస్తా. బొమ్మా, టికెట్టు బార్టర్ భాష మాట్లాడుకుంటాయ్. చేతికి లేని గడియారానికి, లెక్క పెట్టని సమయానికి కూడా ఒక రోజు ఉదయిస్తుంది. పుష్పక్ సినిమా లో పీ ఎల్ నారాయణ లా నేనిక లేవను. అనాధ శవాన్ని ఎత్తుతారు. రాతిరి నిదుర మీద పరుచుకున్న బొంతగా కుట్టిన ఒక ఆకుపచ్చని వస్త్రాన్ని పట్టుకుని ఎవరో దులుపుతారు. చీర లోపల వేలాది రంగు కాగితపు బొమ్మ ముక్కలు ఉంటాయి. జీవమున్నవి ఆకాశంలోకి పక్షులై ఎగురుతవి, కొన్ని కప్పల్లా వంతెన కింద మురుగుకాలువలో మునక వేస్తవి. కలలు లేని, కదల లేని బొమ్మలపై వాహనాల చక్రాలు సంతకాలు చేస్తాయి. మానవ నడక పాద ముద్రలు వేస్తాయి. తొంభయ్ ఏళ్ళది ఏదీ మిగలదు, గాలికి కొట్టుకు పోయి రోడ్డు వారన చీమ తప్ప మరేం చేరని మూలలో బ్రతికిపోయిన ఒకే ఒక బొమ్మ మాత్రం ఎంత కాలానికి శాపగ్రస్తుల కంట పడదు. ఒక చిన్న పిల్లవాడు మెరిసే కళ్ళ శక్తి ఉన్నవాడు, ఒక కల వరంగా పొందిన వాడికి ఒక రోజు దొరుకుతుంది అది. దాన్ని వాడు అందుకుంటాడు. సంతకం లేని ఒక జీవ కల అందులో చిత్రించబడి ఉంటుంది. మా ఊళ్ళో మార్కెట్ యార్డ్ ఎదురుగా రోడ్డు మీద ఒక చిత్రకారుడు చాక్ పీసులతో, రంగు రాళ్ళతో మహా కాళిక బొమ్మ వేస్తూ ఉంటాడు. కర్నూలు జిల్లా, నంద్యాల తాలుకా, నూనేపల్లే గ్రామ వాస్తవ్యులు ఆ యమ్మకు నమస్కరించుకుని చిల్లర డబ్బులు ఆ బొమ్మ మీద పెడుతూ ఉంటారు. కాసింత సమయం కొరకు ఆర్టిస్ట్ తన బొమ్మ వదిలి ఆ చిల్లర మీదకు వాలగానే జనం మధ్యలోంచి ఒక చిన్న వెధవ చటుక్కున వంగి చేతికందిన రంగురాళ్ళు పుచ్చుకుని, కాళికామాత వంటి నీలిమ వేలికంటించుకుని ఎగిరిపోతాడు. వాడి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. లబ్‌డబ్ లబ్‌డబ్ లబ్‌డబ్…… ఒక కొత్త కల మొదలవుతుంది. నేను మళ్ళీ పుడతాను.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *