అనగనగా అందరికీ తెలిసిన ఒక బాపుగారు. ఆయనకు రెండే చేతులు. ఆ రెండు చేతుల్లో నున్న పెన్సిల్, పెన్ను, పేపరు , ఇంకు , బ్రష్ , రంగుల గార్ల కథే ఇది.
అప్పట్లో నేను ఏ పెన్నుల పచారీ కొన్నా ఒకటికి నాలుగు ఎక్కువే కొనేవాణ్ణి. తక్కువ ధర అయితే రకానికి పది కొనడం కూడా తక్కువే. అప్పట్లో నాకోసం ఏది కొన్నా “ఇది నాకు, ఇది మీకు” అని బాపు గారికి చూపేవాడిని. నేను చూపిన ప్రతి పెన్నూ- పేపర్ కేసి కాదు కానీ ఆయన కాస్త శ్రద్దగా, అమిత ప్రీతిగా చూసిన ఒక పెన్ను ఉంది. ఆ పెన్ను సకురా వారిది. సకురా అనేది జపనీస్ వారి పెన్నుల సంస్థ . వారు తయారు చేసిన అనేకరకం పెన్నుల్లో ఒక కలిగ్రఫీ పెన్ను ఉంది. అది మూడు రంగుల్లో వచ్చింది. నలుపు, నీలం ఎరుపు. అది 1mm, 2mm, 3mm అనే మూడు కొలతల్లో రాసేది. బొమ్మల పనికి నలుపు రంగు ముఖ్యం కదా! అన్నిటికన్నా అతి సన్నగా రాసే 1mm పెన్ను నా పర్సనల్ ఛాయిస్.బాపు గారికి కూడా ఆ నల్లని . 1mm పెన్ను మీద మనసయింది. మాటిమాటికీ నన్నాయన దానినే అడిగేవారు. చివరి సంవత్సరాలలో ఆయన గీసిన చాలా కార్టూన్లు, కథలకు బొమ్మలు, క్యాప్షన్ రాతలకు ఆ పెన్ను ములికే గీత రాతల నడకయ్యింది. వాటర్ ప్రూఫ్ పెన్ను అది. వాడే కొత్తలో చాలా పదునుగా రాసేది, రాయగా రాయగా కాస్త మొద్దుబారేది. మొద్దు ముక్కతో కూడా ముద్దుగా రాసేవారు బాపు. ఇది ఆయన చివరి బొమ్మల తాలూకు పని ముట్టు.
“మరి ఆయన కుంచెకేం పేరు లేదా?” అని మీరడిగితే… ఎందుకు లేదు! విన్సర్ అండ్ న్యూటన్ సెప్చర్ గోల్డ్-2 అనేది ఆయన లైన్ డ్రాయింగ్‌కు వాడే బ్రష్ పేరు. ఇప్పటి సంగతి నాకు తెలీదు కానీ, అప్పట్లో ఆ బ్రష్ ఇండియాలో మాత్రం దొరికేది కాదు. బాపుగారి వీరభక్తుడు శ్రీ గంధం దుర్గాప్రసాద్ గారు ఆ బ్రష్‌లను, స్పీడ్ బాల్ ఇంకులను బాపు గారి కోసం ఎక్కడెక్కడి నుంచో తెప్పించి పెట్టేవారు.
కుంచెల గురించి ఒకసారి ఒక తమాషా సంగతి చెప్పారు బాపుగారు: “సినిమాల్లో చాలా బిజీగా ఉన్నప్పుడండి! నా వద్దనున్న కుంచెలు అరిగిపోయాయి. ‘పెరుమాళ్ శెట్టి’ అంగడికి వెళ్ళి మెటీరియల్ కొనేందుకు కూడా సమయం లేదు. మీకు తెలుసుగా… బ్రష్ అడుగున ఇంకు పేరుకుపోతే పైన బ్రష్ ఎలా ఘోరంగా విచ్చుకుంటుందో! గతి లేక ఆ బ్రష్‌లనే అలానే వాడి, ఆ చీపురు అంచుతోనే బొమ్మలు గీసేవాణ్ణి. గీత రెండుగా విచ్చి వచ్చేసేది. అలా అచ్చైన బొమ్మలు చూసి జనం— ‘అరే! బాపు మళ్ళీ బొమ్మల స్టైల్ మార్చేశాడ్రా!’ అనడం మొదలుపెట్టారు. దాన్ని నిజం అనుకుని, నా సమకాలీన చిత్రకారులు కొంతమంది… తాము కూడా అదేదో కొత్తరకం స్టైల్ అనుకుని, కష్టపడి రెండు గీతల బొమ్మలు వేయడం మొదలుపెట్టారు! ఇలా ఉంటాయి కొన్ని తమాషాలు” అని నిండుగా నవ్వారు.
ఒకసారి ఒక తమాషా అనిపించని సంగతి కూడా చెప్పారు బాపుగారు. మదరాసు మహానగరంలో ‘పేరెందుకు లెండి’ అనే చాలా పెద్ద ఆర్ట్ మెటీరియల్ స్టోర్ ఉంది. ఒకానొక కాలంలో దేశంలోనే అత్యంత ప్రఖ్యాత దుకాణం అది. విశ్వాసులు మక్కాను దర్శించుకోవాలని కోరిక పెట్టుకున్నట్లు… నాకు కూడా జీవితంలో ఏదో ఒకరోజు ఆ స్టోర్ మెట్లు ఎక్కాలని గొప్ప కోరికగా ఉండేది. ఓసారి బాపుగారి వద్ద ఇంకు అయిపోతే, ఆయన ఆ దుకాణానికి వెళ్లారట. , అక్కడ పార్కింగ్ కు చోటు లేదు, ఆ దగ్గరలో ఎక్కడో నో పార్కింగ్ దగ్గర చోటు చూసుకుని, అక్కడ కారు పెట్టి గబగబా షాపుకు వచ్చి ఆయాసంగా “అయ్యా! కాస్త అత్యవసరంగా ఒక రెండు ఇంకు సీసాలు ఇవ్వండి. అక్కడ కారును పార్కింగ్ కూడని చోట పెట్టి వచ్చాను. త్వరగా తీయకపోతే ఇబ్బంది అవుతుంది” అని వేడుకున్నారట.ఆ షాపు ఆయన బాపు గారిని ఎగాదిగా చూసి “That is not my headache. If you want ink, wait until I give it to you” అని దురుసుగా మాట అన్నాట్ట.
బాపుగారు అంటారు కదా — “నేనేదో పేరున్న ఆర్టిస్ట్‌ని కదా, నాకు త్వరగా ఇవ్వాలని నా డిమాండ్ కాదండీ! వయసులో పెద్దవాడిని కదా… కొద్దిగా నా వయసు చూసి, త్వరగా ఇంకు ఇస్తే, ఎక్కువ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయి బొమ్మలేసుకోవచ్చు కదా అని ఆశపడ్డా” అని మళ్ళీ నవ్వారు. కానీ ఆ మాట విన్నాక నాకు మాత్రం నవ్వు రాలేదు. నేను ఉన్నంత కాలం బాపుగారు పెన్నుకని, పేపరుకని, పెన్సిల్, ఇంకులకని ఇబ్బంది పడకుండా చూసుకోవాలని నాకు నేనే మనసులో మాట ఇచ్చుకున్నాను. అనుకున్నట్లుగానే ఆ మాట నిలబెట్టుకున్నాను కూడా!
హిందూస్తాను షాపులో దొరికే నల్లని తారు లాంటి చిక్కని పెబియో ఇంకు కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నూడ్లర్స్ బుల్లెట్ ప్రూఫ్ ఇంకు ఆయన కోసం తెప్పించాను. ఆయన భలే సంబరపడ్డాడు “ నిజంగా ఈ ఇంకుని పెన్నుల్లో పోసి బొమ్మలు వేసుకోవచ్చా? పెన్ను పాడు కాదా? ఇంకు గడ్డ కట్టదా? అని తిప్పి తిప్పి ఆ బాటిల్ని అటూ ఇటూ చూసుకున్నారు. ఆ ఇంకు పోసుకోవడానికి ఆయనకో తమాషా పెన్ను ని కూడా ఈబే’ వేలంలో కొన్నాను ఆ రోజుల్లో. ఆ పెన్ను పేరు హీరో ఫ్యూడ్ ఎమ్ 86. మిత్రులకు రాసే ఉత్తరాల కవర్ల పైన అడ్రస్ ల దగ్గరి నుండి. బొమ్మ దగ్గర రాసే శీర్షికల వరకు ఆ పెన్నుతో ఆయన ఎక్కడ రాసినా ఆ నిబ్ మెలికని గుర్తుపట్టేవాడిని నేను !
ఒకసారి బాపు గారు ఒక బొమ్మని చూపారు నాకు. అది 90ల కాలంలో ఆంధ్రప్రభ వారపత్రికలో ఒక కథకు వేసిన బొమ్మ. దాని తాలూకు అచ్చయిన బొమ్మని నేను మా ఊళ్ళో చదువుకునే రోజుల్లో పత్రికలో చూశాను. ఆ రోజుల దగ్గరి నుండి ఆ బొమ్మ ఒరిజనల్ ని అప్పుడు అక్కడ నా చేతుల్లో పట్టుకు చూడటం అంటే ఎంత థ్రిల్ అనుకున్నారు. ఆ సిరీస్ బొమ్మలు మరి కొన్ని చూపారాయన నాకు . “ ఇవన్నీ స్కాలర్ పేపర్ మీద వేసిన బొమ్మలండీ. ఆ పేపర్ మీద బొమ్మలు వేస్తుంటే ఎంత బాగా కుదిరాయనుకున్నారు? కార్టూనిస్ట్ శంకు ఈ పేపర్లు ఇచ్చారు నాకు, ఆ తరువాత ఎంత ప్రయత్నించినా ఆ స్కాలర్ పేపర్ ఎక్కడా దొరకనే లేద”ని బాధ పడ్డారు. “చూడండి, ఈ పేపర్‌కు పైన చిన్న గోపురం గుర్తు కూడా ఉంటుంది” అని చెబుతూ, ఆ కాగితానికి ఒక మూల ఉబ్బెత్తుగా కనపడే లోగోను కూడా నాకు చూపించారు బాపుగారు. ఇక ఆ రోజుల్లో నా గమ్యం, నా లక్ష్యం అంతా ఆ జర్మన్ స్కాలర్ పేపర్ సంపాదించడమే. గౌలీగూడ చమన్, ఉస్మాన్‌గంజ్ స్టేషనరీ దుకాణాలు, బేగంబజార్ మార్కెట్, నాంపల్లిలోని రాయల్, చిక్కడపల్లిలోని పద్మావతి — ఎక్కడ తిరిగినా ఆ కాగితం దొరకనే లేదు.
ఎవరో ఒకరు చెప్పారు, రాణిగంజ్ లో ప్రయత్నించమని. ఆ రాణిగంజ్ సన్నని గల్లీలలో నా స్కూటర్ వేసుకుని ఎంత తిరిగానో! నడుస్తూ తిరిగితే గోడవేం లేదు. అలా బండి మీద కిక్కిరిసిపోయిన జనాల మధ్య వెళ్ళడానికి నాకు చాలా చాలా ఇబ్బంది అయ్యింది. అయినా సరే, ఎలా అయినా సరే బాపుగారికి స్కాలర్ పేపరు తెప్పించాలి. అలా వెదుకుతూ వెదుకుతూ నేను బొంబాయ్ నగరం వెళ్ళి క్రాఫర్డ్ మార్కెట్ చేరుకున్నాను. అంత పెద్ద మార్కెట్‌లో నాకు భవేష్ కొఠారి అనే వ్యక్తి పరిచయమయ్యారు. ఆయన వద్ద నాకు కావాల్సిన ఆ కాగితం దొరికింది — అదే రంగు, అదే గోపురం గుర్తు. ఆయన వద్ద ఉన్న కాగితాల ప్యాకెట్ మొత్తాన్ని కొనేశాను. దానిపై బాపు గారి చిరునామా రాసి, బొంబాయ్ నుంచే మద్రాస్‌కు పంపించాను.
ఆ పిమ్మట ఆ కిషోర్ కొఠారిని అడిగి ఆరా తీశాను. అసలు ఈ కాగితం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు ఇంపోర్టర్స్ అని. ‘ఇండియన్ ఇంజినీరింగ్ ఏజెన్సీస్’ అని మద్రాస్ లో ఉంటుంది. ఇండియా మొత్తానికి వారే ఈ పేపర్ ఇంపోర్ట్ చేస్తారు. ఇదే కాదు వాళ్ళే బోకింగ్‌ఫోర్డ్ అనే చాలా మంచి ఇంగ్లీష్ వాడి పేపర్ కూడా ఇంపోర్ట్ చేస్తారని తెలిసింది. చూశారా! బాపు గారు ఎక్కడెక్కడో వెతికారు. చివరకు జర్మనీలో కూడా ఆరా తీశారు. కానీ, ఆ పేపరు వాళ్ళ ఊరిలోనే ఉంది. ఆ తర్వాత నేను ఆ సంస్థ వారితో పరిచయం పెంచుకున్నాను. యువరాజ్ జైన్, ఆనంద్ జైన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఆ సంస్థను చూసుకునేవారు. వారికి బాపు గారి చిరునామా ఇచ్చి, “ఆయనకు ఎప్పుడైనా స్కాలర్ పేపర్ అవసరమైతే పంపిస్తూ ఉండండి” అని చెప్పాను. వాళ్లు అలాగే చేశారు కూడా. ఆ తర్వాత కొంతకాలానికి కేన్సన్ అనే ఒక ఫ్రెంచ్ పేపర్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. బాపుగారు అప్పుడు స్కాలర్‌ను వదిలి, కేన్సన్‌ను పుచ్చుకున్నారు.
ఒకసారి ఆర్టిస్ట్ చంద్రగారు అమెరికా నుండి వస్తూ వస్తూ నాకోసం బోలెడు స్ట్రాత్‌మోర్ పేపర్ ప్యాడ్స్ తెచ్చి ఇచ్చాడు. ““అన్వర్! వీటి నిండా బొమ్మలు వేసి పుస్తకం పూర్తయ్యాక దాని వెనుక అట్ట మాత్రం నాకు వెనక్కి ఇచ్చేయ”మన్నాడు. ఆ బొమ్మల కాగితపు ప్యాడ్‌లు కొన్ని బాపుగారికి ఇచ్చేశా, అలా అవి ఇచ్చి ఇలా ఇది కూడా చెప్పా “బాపుగారూ, వీటి నిండా మీరు బొమ్మలు వేసి అదయ్యాకా దాని వెనుక అట్ట బ్రౌన్ రంగులో ఉన్నది, చూడండి! అది మాత్రం నాకు వెనక్కి ఇచ్చేయండి, ఎందుకంటే అవి చంద్రగారు అడిగారు.” నా మాటలకు బాపుగారు నవ్వారు. “ఇస్తా” అన్నారు కానీ ఇవ్వలేదు!
లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత కొన్నాళ్లకు… ఆయన చిన్నబ్బాయి వెంకటరమణ గారు— “ఇవి బాపుగారు వాడుతూ వాడుతూ వదిలి వెళ్లిన కాగితాలు” అంటూ బోలెడు డ్రాయింగ్ ప్యాడ్లను నాకు పంపించారు. కట్టల కొద్దీ కాగితాలు అవి! బాపుగారి మాటల్లోనే చెప్పుకోవాలంటే— “ఇంత వెన్నెల నేనొక్కడినే ఏం చేసుకోనూ?”
అందుకే… బాపుగారి ‘పిల్లలు’ అనదగ్గ ఎంతోమంది చిట్టి, చిన్ని ఆర్టిస్టులు ఎవరు పరిచయమైనా సరే… బాసర సరస్వతి దేవి ప్రసాదంలా ఆ కాగితాలన్నింటినీ ఆ పిల్లలకే పంచేశాను. వాళ్ళు వాటిని కళ్ళకు అద్దుకుని, గుండెలకు హత్తుకుని మరీ తీసుకుని ఎగిరెళ్లిపోయారు. కానీ, వాళ్ళందరి మధ్యలో ఒక చిన్నపిల్లవాడు నన్నే చూస్తున్నాడు. నేను వాడిని చూడలేదు. వాడు అప్పుడు నన్నేం అడగలేదు కానీ, మనసులో మాత్రం కచ్చితంగా అడిగే ఉంటాడు— “బాపు తాత కాగితాలు మరి నాకేం లేవా… బాబూ?” అని. (మా అబ్బాయి నన్ను ‘బాబు’ అని పిలుస్తాడు) ఆ చిన్నపిల్లవాడు పెద్దవాడయ్యి, బొమ్మలేసేవాడు కూడా అయ్యాక… వాడికి ఓ మధ్య ఒక బొమ్మ వేయాల్సిన పని పడింది. ఇంట్లో చూస్తే బొమ్మలు వేసే కాగితాలు మంచిరకానివి ఏమీ లేవు. నేను ఊరికే ఆర్టిస్ట్ నని చెప్పుకు తిరుగుతాను కానీ, నా వద్ద బొమ్మలేసే కాగితాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు. ఎక్కడ పడితే అక్కడ, ఏ చిత్తు కాగితం దొరికితే ఆ కాగితం మీద బొమ్మ వేసే శ్రద్ధ తక్కువ రకాన్ని నేను!అప్పడు మా పిల్లవాడు ఏం చేసాడంటే గోడకు తగిలించుకునే క్యాలెండర్ లోని 12 కాగితాల్లో ఒక కాగితాన్ని చింపి టకటకా దానిమీద ఒక పెద్ద బొమ్మ వేసేసి దానిని ప్రదర్శనకు పెట్టేశాడు. ఆ ప్రదర్శన నడిచిన ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోనే ఒకప్పుడు వాడు బాపు గారి పక్కన కూచున్నాడు, ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోనే వాడు చంద్రగారి చిటికెన వేలు పట్టుకుని నడిచాడు, మోహన్ గారి చేయి పట్టుకుని ఊగాడు. వీడి దగ్గర బొమ్మల కాగితాలు లేవు కానీ, బాపు, చంద్ర, మోహన్ గార్ల వారసత్వం ఉంది. ఆ పైనుండి పట్టిన చల్లని కుంచెల నీడ ఉంది.
ఆ బాపుగారి అబ్బాయి పంపిన కాగితాల కట్టలోనే… బాపుగారు వేసి పెట్టుకున్న ఒక అసంపూర్ణ పెన్సిల్ స్కెచ్ ఒకటి నాకు దొరికింది. దానికి ఇంక్ చేసి, రంగులు వేయాల్సి ఉండగా… బాపు గారికి భూమి మీద అప్పటికే సెలవు పూర్తయింది. రాముడు వెనక్కి పిలిపించుకున్నాడు.బాపుగారి రంగుల బొమ్మలు ఎవరి దగ్గరైనా ఉండవచ్చు, ఎక్కడ పడితే అక్కడ దొరకవచ్చు. కానీ, ఆయన పెన్సిల్ స్కెచ్ దొరకడం చాలా చాలా అరుదు! బాపు గారి బొమ్మలంటే ప్రాణం ఇచ్చే అనేకమంది అభిమానులలో ఒక మేడమ్ గారు ఆ సమయాల్లోనే నన్ను అడిగి ఉన్నారు— “బాపు గారి ఒరిజినల్ బొమ్మ ఏమయినా ఒకటి దొరుకుతుందా అండి?” అని. నా చేతికి దొరికిన ఆ రఫ్ స్కెచ్ బొమ్మను, దొరికింది దొరికినట్లుగానే ఆవిడకు ఇచ్చేశాను. అది చూసి ఆవిడ కళ్ల నిండా నీళ్లు! బొమ్మల్ని చూస్తే ఎవరికి పడితే వారికి కంట జల రాలదు. అలాంటప్పుడే బొమ్మలూ, చిత్రకారులు ధన్యులు అవుతారు. బాపుగారు ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయనని సంతోషపెట్టడం ఎలానో నాకు కొంచెం ఎక్కువగానే తెలుసు.
(బాపుగారి బొమ్మల కథలు, బొమ్మలేసే సామాగ్రి కబుర్లలో ఇది మొదటిది. చెప్పవలసింది ఇంకా చాలా ఉంది – అన్వర్)

Leave a Reply